⚛️🪷🌳 అష్టాచమ్మా చలనచిత్రంలో మహేష్ అంటే ఓ వైబ్రేషన్ అనే లాగా నా జీవితంలో “వంశీ” అనే పేరు వింటే నాలు సానుకూల తరంగాలు ప్రతిధ్వనించేవి. ఇలా మొదలవ్వడానికి కారణం నువ్వే వంశీ. మన ఇద్దరికీ ముఖ పరిచయం అయ్యింది రెండో తరగతిలో అయినా, మనం పాఠశాల మారిపోవడం మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇద్దరం పాఠశాలలు మారి ఒకే పాఠశాలలో కలవడం, పాత ముఖ పరిచయం వల్ల, మనస్తత్వాలు కలవడం వల్ల నూతన పాఠశాలలో మన మధ్య స్నేహం తొందరగానే చిగురించింది. రెండు సంవత్సరాలు ఇద్దరం ఆదివారం అవ్వగానే ఉదయాన్నే వాకింగ్ అనుకుంటూ మనకు తెలిసిన కడప చుట్టూ ఉండే కొత్త ప్రదేశాలకు నడుచుకుంటూ తిరిగేవాళ్లం. ఆర్ట్స్ కాలేజ్, రాజీవ్ పార్కు, ఎల్ఐసి పార్కు, కలెక్టర్ బంగ్లా, దాని పక్క పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ దగ్గరున్న ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన వాటర్ ట్యాంక్, వివిధ కూడళ్ళు, కొన్ని దేవాలయాలు, తిరిగి వాళ్ళము. కొన్నిసార్లు మనకు తోడుగా మన తోబుట్టువులు కూడా మనతో పాటు వచ్చేవారు. అప్పుడు మనం బయట ఏమి తినేవాళ్ళం కాదు, కేవలం నడుచుకుంటూ కొత్త ప్రదేశాలు చూడటం, సరదాగా గడపడం కోసం మాత్రమే నడిచే వాళ్ళం. ఆ సమయంలో మనకు కొన్ని కొత్త పరిచయాలు కూడ...