Vamsi Kalugotla

వంశీ కలుకొట్ల గారు, ఈ అకస్మాత్తు హఠాత్ దూరం నమ్మశక్యంగా లేదు, భావాలను వ్యక్తపరచటానికి మాటలు లేవు, కానీ రచన మాధ్యమంలో మీరు ఇచ్చిన కోన్ని ప్రేరేపిత ఆలోచన భావాల పట్ల సంతృప్తిగా ఉంటూ మీకు నివాళులు అర్పిస్తున్నాను 🙏 

మీరు నాకు పరిచయమై కేవలం 6 నెలలే ఆయన, తెలుగు రచన వ్యాయామాల ద్వారా మీరు స్మృతులొ జ్ఞానమై నా పరిధిలో కొద్దిగా చిరంజీవిగా భాసిల్లుతారని ఆశిస్తున్నాను.
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతి:

Vamsi Garu, One year of this sudden long distance is unbelievable, there are no words to express my feelings, but Vamsi garu I am satisfied with some of the stimulative thoughtful feelings you gave me through writings. 
I have only 6 months of acquaintance with you. But in my limits, you live long as a knowledgeable writing exerciser in my memories. 

Peacefully take rest in Universe.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం

06.May.2021

నీవల్ల కాదని 

ఎవరో అన్నారని  

... ఆగిపోకు 

నువ్వు సాధించగలవని 

ఇంకెవరో అన్నారని 

... పరిగెత్తకు 

నువ్వు ప్రేమించేది 

నీకు నచ్చింది చెయ్ 

*** వంశీ కలుగోట్ల ✍️🤘


05.May.2021

// అనుకుంటాం కానీ ... //

విజయం సాధించటానికి

యుద్ధం చెయ్యాలని అనుకుంటాం కానీ ...

ఆ అవసరమే లేదని

గోబెల్స్ సృష్టించిన ఆధునిక

ప్రపంచం నేర్పింది

పోరాటానికి ఆయుధం

అవసరం అనుకుంటాం కానీ ...

అక్కర్లేదని పిల్లాడు సాధించుకున్న బొమ్మ

నాకో నిజాన్ని చెప్పింది 

అద్భుతాలు చెయ్యటం

దేవుడికే సాధ్యం అనుకుంటాం కానీ

ఆర్తుల మొహంపై చిరునవ్వు అనే అద్భుతాన్ని

సాధించిన మనీషిని చూసినపుడు

నేను కూడా ...

అద్భుతాలు సాధించగలనని తెలిసింది.


3 May 2021

ఒకరు ఓడారు, 

ఒకరు గెలిచారు. 

మిగతా అంతా మామూలే ... 🤷


3 May 2021

సూడు సిద్దా వరదొచ్చినపుడు మంచీ, సెడ్డా ఏమీ ఉండదు ఊరు మొత్తం కొట్టుకుపోతాది. 

దేవుడు నీ మంచిసెడ్డల లెక్కలు రాసుకుంటా కూకోడు

*** వంశీ కలుగోట్ల ✍🤘

 

3 May 2021 

పంజరంలో చిలుక అడిగింది 

జీవితం ఎలా ఉంది అని 

లాక్డౌన్ కష్టాలు అన్నీ ఏకరువు పెడుతూంటే 

విని జాలిగా నవ్వింది 🤷‍♂️


2 May 2021

పార్టీ సంస్థాగత నిర్మాణం పట్ల దృష్టి పెట్టకుండా, తామేం చేయగలరో ఒక స్పష్టత లేకుండా అధికారంలో ఉన్నవారిని విమరిస్తే ఓట్లు పడవని కమల్ హాసన్ కూడా నిరూపించాడు 😉

 

28 April 2021

యుద్ధం వచ్చినప్పుడు/చెయ్యాల్సొచ్చినప్పుడు 

పోరాడి గెలిచేవాడు యోధుడు

తాను గెలవగలను అని నిరూపించుకోవడానికి 

యుద్ధం చేసేవాడు క్రూరుడు 

*** వంశీ కలుగోట్ల ✍🤘


 27 April 2021

నడిచే దారిలో

పాదముద్రలెన్ని కనబడుతున్నా

గమనం మాత్రం ఒంటరే

చుట్టూ నదులెన్నున్నా 

దాహం తీరదు 

సమూహాల మధ్యలో ఉన్నా 

ఒంటరితనం వీడదు 

"మాయ"

*** వంశీ కలుగోట్ల ✍️🤘


24 April 2021

బాధను మర్చిపోవాలన్నా

సంతోషం గుర్తుండిపోవాలన్నా 

షేర్ చేసుకుని 

సెలెబ్రేట్ చేసుకోవాలి 

*** వంశీ కలుగోట్ల ✍️🤘

 

20 April 2021

"రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా?" అని శ్రీశ్రీ గారిని ఎవరో అడిగారట. దానికాయన "ఊరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డు వెళ్ళదు కదా!" అన్నాడట.

నోట్: ఎంతవరకూ నిజమో కాదో కానీ త్రివిక్రమ్ డవిలాగు పంచ్ కంటే కిక్కెక్కువ ఉన్న సమాధానమది👌👌👌


15 April 2021

నాకు బాగా తెలిసిన ఒకతను బాగా సక్సెఫుల్ పర్సన్ అయ్యాడు, అంతకుముందు నాతో సలహాలు తీసుకునేవాడు. 'మీ సలహాలే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి' అని చెప్పేవాడు. బాగా సక్సెఫుల్ అయ్యాక, తీరిక లేకనో మరోటో కానీ కలవడం మానేశాడు. కామన్ ఫ్రెండ్ ఒకడు ఆ మధ్యన కలిశాడట, 'మనోడి సలహాల వల్లే నువ్వు బాగా ఎదిగావట కదరా' అన్నాడుట. దానికి వాడు 'సక్సెస్ హాస్ మెనీ ఫాదర్స్' అన్నాడుట. దానివల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే 'నిజంగా అవతలివాడు మన సలహాలు తీసుకునే రేంజ్ లో మనం ఉంటే, అది వాడు చెప్పాలి మనం చెప్పుకోకూడదు'. మన మంచితనం చెప్పుకోవచ్చబ్బా, మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు. ఏందీ అర్థమైందా అదీ సంగతి.  

*** వంశీ కలుగోట్ల ✍️🤘

 

14 April 2021

మృత్యువును జయించడమంటే, చావకుండా ఉండటం కాదు... చచ్చిన తరువాత కూడా, నువ్వు తపించిన లక్ష్యం కోసం పోరాటం ఆగకపోవటం.

నీవారో, నిన్ను మెచ్చినవారో, నీ భావాలను సమర్థించేవారో, ఎవరైతేనేం...... పోరాటం ముందుకు తీసుకుపోవటానికి నీకు అమరత్వం ఆపాదించటానికి "మృత్యువు కూడా ఆపలేని లక్ష్యపు గమనమే అమరత్వాన్ని సిద్ధింపజేసేది"

*** వంశీ కలుగోట్ల ✍️🤘


12 April 2021

నువ్వూ, నేనూ అనేవి

అస్థిత్వాలుగా ఉన్నంతకాలం

మనం అనేది భ్రమ మాత్రమే

దేశాలు, సరిహద్దులు

... ఉన్నంతకాలం

యుద్దాలు జరుగుతూనే ఉంటాయి

సమానత్వం, శాంతి అన్నవి

భావుకులు రాసుకునే కవితల్లో

ఆశలుగా వికసిస్తుంటాయి

*** వంశీ కలుగోట్ల ✍🤘


 · 

11 April 2021

 // ... నమ్మకు // 

ఎవడన్నా దేశం కోసం, ప్రజలకోసం 

అంటూ వచ్చాడంటే నవ్వుకో గొర్రెలా తలూపకు 


గ్రామం, ప్రాంతం, రాష్ట్రం, దేశం ... 

అవన్నీ భౌగోళీకాలు కావు.. 

కొందరు సమూహంగా ఏర్పడి 

తాము మాత్రమే ఉండాలనుకుని 

గీసుకున్న విభజన గీతలు 

ఏర్పరుచుకున్న విభేదాల కంచెలు 


అందరి కోసం ... 

అని ఎవడన్నా అన్నాడంటే 

తానున్న సమూహం కోసం అని 

సమూహం ద్వారా 

తానెదగడం కోసమని 


మనిషన్నోడెవడూ లేడిక్కడ 

గ్రామస్థులు, రాష్ట్రీయులు, దేశస్థులు 

అవేవీ కాకపొతే 

కులస్థులు, మతస్థులు తప్పించి 

మనిషికి చోటు లేదిక్కడ 


మనిషిగా గుర్తింపబడాలంటే 

కులమో, మతమో, ప్రాంతమో, దేశమో 

ఎదో ఒక ముసుగేసుకుని 

సమూహంలో కలిసిపోవాల్సిందే 


నువ్వూ, నేనూ అనేవి 

అస్థిత్వాలుగా ఉన్నంతకాలం 

మనం అనేది భ్రమ మాత్రమే 

దేశాలు, సరిహద్దులు 

... ఉన్నంతకాలం 

యుద్దాలు జరుగుతూనే ఉంటాయి 

సమానత్వం, శాంతి అన్నవి 

భావుకులు రాసుకునే కవితల్లో 

ఆశలుగా వికసిస్తుంటాయి


6 April 2021

ఎవరెన్ని పాఠాలు చెప్పినా 

ఎన్ని సూక్తులు చెప్పినా 

అర్థం చేసుకోవలసింది ఒకటే 

"బలవంతుడవైతే 

... వేటాడు 

బలహీనుడవైతే 

... పరిగెత్తు"

... చంపు లేదా చావు 

ప్రకృతి ధర్మం అదే 

(అవసరమో కోసమో

ఆధిపత్యం కోసమో)

*** వంశీ కలుగోట్ల ✍️🤘


 

2 April 2021

వాడు: ఏం చేస్తున్నావు రా

వీడు: రాస్తున్నాను

వాడు: ముందు బాగా చదువురా

వీడు: చదవటానికే కదా రాస్తున్నది

వాడు: 🤨🤨🤨

*** వంశీ కలుగోట్ల ✍



2 April 2021

// ... పాఠకులు //

రాసే ప్రతి అడ్డగోలు రాతనూ

చదివి వదిలేసే వాళ్ళు కాదు ... పాఠకులంటే


కాసింత మంచిని, మరికాస్త స్ఫూర్తిని

అక్షరాలతో పంచినందుకే  

నిన్ను భుజాన మోసే మనుషులు

నడిపించే కరతాళధ్వనులు

ప్రోత్సహించే సహృదయులు వాళ్ళు


కొన్ని కాలాలు కక్కే చెత్తనంతా వేరు చేసి

అక్కడక్కడా కనబడే కాసింత స్ఫూర్తిని

... స్వీకరించగలిగే రాజహంసలు పాఠకులు

*** వంశీ కలుగోట్ల ✍🤘


1 April 2021

సూడు సిద్దా, బాధలను మించిన ఆనందాలను సాధించటమే జీవితంరా

*** వంశీ కలుగోట్ల ✍🤘


30 March 2021

మంచితనంతో బతికేవాళ్ళను 

బహుశా గౌరవిస్తారేమో  

ఇంకా మంచోళ్ళయితే దేవుళ్ళుగా పూజిస్తారేమో  

తప్పించి, ఆ మంచిని పాటించడం అంటే 

... ఊహూ, కుదరదు 

రాముడిని విగ్రహరూపధర్మం చేసి 

... గుడిలో బందీని చేశారు 

గాంధీని నోట్లమీద బొమ్మను చేశారు 

సంవత్సరానికి ఒక డ్రైడేగా మార్చారు 

ఇక నువ్వూ నేనూ ఎంత 

*** వంశీ కలుగోట్ల ✍️🤘


30 March 2021

If you compromise with your mistakes now – you will have to compromise with the failures in future.

*** VK007 ✍️🤘


23 March 2021

మిరపకాయ పంట మన దేశానికి తేకముందు మన దేశంలో మిరియాలే వాడేవాళ్ళు అని తెలియడం జ్ఞానం; కారంపొడి, మిరపకాయలు లేకపోతే మిరియాలపొడి కారం కోసం వాడవచ్చు అని తెలియడం అవగాహన; కారంపొడి లేకపోతే వంటే చెయ్యలేమనుకోవడం మూర్ఖత్వం; ఎర్రగా ఉంది కదా, అది కూడా కారపు రుచే ఉంటుందనుకుని కుంకుమ వాడటం అమాయకత్వం. అవన్నీ చేసేవారిని చూస్తూ ఊరకుండటం నిగ్రహం, ఆ విషయాలన్నీ తెలిసి కూడా ఇలా చెప్పటం దూలానందం

*** వంశీ కలుగోట్ల ✍️


20 March 2021

నేరస్థులు కౄరంగా కనబడతారా? అంటే మరి సినిమాల్లో, సీరియల్స్ లో, లఘు చిత్రాలలో అలానే చూపుతారు కదా. కౄరంగా కనబడుతూ; మందు, సిగరెట్ తాగుతూ ... ఇలా. 

అదేంటో కానీ పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టినపుడు చాలామంది మనలానే మామూలుగా ఉంటారు. 

ఖలేజా సినిమాలో ఒక సన్నివేశంలో ఎందుకు పారిపోయి వచ్చావు అని అడిగితే 'వాడి దగ్గర కండోమ్స్ ఉన్నాయండి' అంటుంది అనుష్క. దానికి మహేష్ బాబు 'నా దగ్గర అవి కూడా లేవండీ' అంటాడు వెటకారంగా. 

వేషాన్ని చూసి మోసపోయే అలవాటు ఉంది కాబట్టే, మేకవన్నెపులులు ఎక్కువుంటాయ్. మంచితనం ముసుగేసుకున్న పెద్దమనుషులుంటారు. జాగ్రత్తగా మసలుకోండి అని ఎవరూ చెప్పరు, మనం తెలుసుకోవాలంతే 🤓

*** వంశీ కలుగోట్ల ✍️🤘


19 March 2021

  వ్యవస్థలు వ్యక్తులను ప్రేమిస్తాయా? 

హ్మ్ వ్యవస్థల్లో కూడా వ్యక్తులే ఉంటారు. ఆ వ్యక్తులను, మరికొందరు వ్యక్తులు నియమిస్తారు. ఆ వ్యక్తులు, ఈ వ్యక్తులు అవసరార్థం పరిధిలోనో, పరిధికి ఆవలనో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నది వ్యక్తిగతమే తప్ప వ్యవస్థ లక్షణం కాదు. 

"వ్యవస్థ వ్యక్తులమీదే ఆధారపడి ఉంటుంది"

*** వంశీ కలుగోట్ల ✍️🤘


16 March 2021

గెలిస్తే,  పని చెయ్యాలి (చేయించాలి)

ఓడిపోతే, పోరాడాలి

ఏమైనా సరే మనమంటూ ఉండాలి

*** వంశీ కలుగోట్ల ✍️🤘


15 March 2021

'బొంబాయి ప్రియుడు' అని రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఉంది. అందులో ఒక పాట ఉంటుంది 'చందన చీరను గట్టి ఐటెక్స్ కాటుక పెట్టి కొత్త పెళ్ళి కూతురొచ్చెనే ...' అని. చాలా ఫన్నీగా ఉండేది అది వింటుంటే ... అందులో అన్నీ బ్రాండ్ నేమ్స్ వాడి పాట రాశారు. ఏదో సరదాగా అనుకున్నాము కానీ, సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇపుడు మన జీవితాలను కార్పోరేట్స్ నడుపుతున్న విధానం చూస్తోంటే అర్థమవుతోంది. దంతధావనానికి ఉప్పు, బొగ్గు, వేపపుల్ల లాంటివి మంచివి కాదని మనకు బ్రష్, పేస్ట్ అలవాటు చేసిన ఇన్నేళ్ళకు - ఇపుడు ఉప్పు, వేప, లవంగం లాంటివి పేస్ట్ లు అమ్ముతున్నారు. సబ్బులూ అంతే ... సున్నిపిండి కాదని సబ్బులు అలవాటు చేసి, ఇపుడు సున్నిపిండి, ముల్తానీ మట్టి సబ్బులు వచ్చాయి. ఇపుడు మన జీవితాలు కార్పొరేట్ ప్రభావితంగా నడుసుతున్నాయి తప్పించి, మన ఇష్టానుసారమైతే కాదేమో. మన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేసి, మనలను పూర్తిగా వారి అధీనంలో ఉంచుకుంటున్నాయి. ఇది ఇలానే కొనసాగితే బహుశా కార్పొరేట్ ప్రమేయం లేకుండా భవిష్యత్తులో మనం ఉచ్చ కూడా పోసుకోలేమేమో 🤦🤷

*** వంశీ కలుగోట్ల ✍️🤘


· 

9 March 2021

కొన్ని కాయలు పండై రాలిపోతాయి 

కొన్ని తుంచివేయబడతాయి 

కానీ చెట్టు మాత్రం అలానే ఉంటుంది 

కొన్ని తరాల కాయలను మోస్తూ 

పండై రాలిపొమ్మని కాయలకు చెప్పదు 

తుంచేయబడేటపుడు ఆపదు 

... చెట్టొక భావరహిత వేదాంతి 

*** వంశీ కలుగోట్ల ✍️🤘


· 

8 March 2021

... నమ్మకం అనేది 

ఎదుటివాడి మీద ఉంటే ఆశ ఉంటుంది

పరిస్థితుల మీద ఉంటే పిరికితనం ఉంటుంది

శత్రువు మీద ఉంటే భయం ఉంటుంది

మనమీద మనకు ఉంటే ధైర్యం ఉంటుంది

నమ్మకం ఎవరిమీద ఉందన్నది 

... మన భవిష్యత్తును శాసిస్తుంది  

*** వంశీ కలుగోట్ల ✍️🤘


 

2 March 2021

నేను నిష్పాక్షికంగా ఉండగలనా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఉండలేను అనే సమాధానం వస్తుందని నాకు తెలుసు. 'నా' అనే భావన నన్ను వదలనంతవరకూ నిష్పాక్షికత అలవరచుకోలేనని స్పష్టత ఉంది. అన్నీ వదిలి సన్యసించామని చెప్పుకునేవారు కూడా ఏదొక మతానికో, సిద్ధాంతానికో అనుకూలురై ఉండటం చూస్తూనే ఉంటాం. అలాంటిది నాలాంటి వాడి నుండి నిష్పాక్షికత ఆశిస్తున్నారంటే 🤷 (నేను చెప్పేదంతా నాకు అర్థమైన కోణంలోంచే) 

*** వంశీ కలుగోట్ల ✍️🙏


1 March 2021

అవమానాలు, ఛీత్కారాలు, తిరస్కరణలు ఎదురైనపుడు పోరాడినవాడు అమితాబ్ అవుతాడు, చిరంజీవి అవుతాడు, రజనీకాంత్ అవుతాడు - పోరాడలేనివాడు గోడమీద బొమ్మవుతాడు, ఇంట్లో వాళ్ళకు ఒక కన్నీటి జ్ఞాపకంగా మిగులుతాడు. ఆగిపోవడానికి 99 కారణాలు ఉండొచ్చు, ముందుకు సాగటానికి ఒక్క కారణం వెతుక్కోవడంలోనే గెలుపు దాగి ఉంటుంది. 

*** వంశీ కలుగోట్ల ✍️🤘


27 February 2021

సినిమాల్లో టెక్నికల్ ఎఫెక్ట్స్ లాంటిది నమ్మకం అంటే, అది నిజం కాదని నీకూ తెలుసు, అయినా చూసినపుడు నమ్మబుద్దేస్తుంది అదంతే. నచ్చిందా లేదా అన్నదే ముఖ్యమిక్కడ తప్పించి నిజమా కాదా అని అయితే కాదు.  

*** వంశీ కలుగోట్ల ✍️🤘

25 February 2021

ఎవరికెంత తెలుసు అనే చర్చ వృధా! ఆసక్తి ఉంటే తెలుసుకుంటూ పోవడమే. తెలిసిన/తెలుసుకున్న దాంట్లో నిజమెంత అని తర్కించుకోగలగడమే జ్ఞానం వైపు మొదటిమెట్టు. మనిషిని జ్ఞానం వైపు సాగకుండా ఆపే ప్రతిదీ మూర్ఖత్వమే - మతం, కులం, మరోటి. 'అంటీఅంటనట్టుండిన చలికాచవచ్చునగ్గితో ...' అన్నట్టు కులమతాలను ఎంతవరకూ ఉంచాలో, అక్కడితో ఆపాలి. మన మతం/కులం మన ఇంటి గడప దగ్గరే ఆగిపోవాలి; మన విశ్వాసం ప్రార్థనాలయాల మెట్ల దగ్గరే నిలబడిపోవాలి 

*** వంశీ కలుగోట్ల ✍️🤘



 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao