Subrahmanyam Koduganti (సుబ్రహ్మణ్యం కోడుగంటి)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Subrahmanyam Koduganti Garu
(సుబ్రహ్మణ్యం కోడుగంటి గారు)
--------------------------------
ప్రకృతి ప్రేమలో పరవశిస్తూ....
ప్రతిబింబించే పదాలతో ప్రవహిస్తూ...
సహజ సిద్ధమైన
సంఘటనా సంభాషణలను
సుందర సాహిత్యంగా
సుమధుర సుభాషితంగా
స్వీయ సంతృప్తికి
సమాజ సంక్షేమంకు
సామాజిక-మాధ్యమంలో
సరళంగా సులభంగా సాగే
"అ"సాధారణ" "అస్తిత్వం"
సుబ్రహ్మణ్యం గారు....
వారికి ఆలస్యంగా
ఆరోగ్య ఆనందదాయక
జన్మదిన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
-----------------------------
ఏడాదిగా కనపడని వాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పేసారు.. జనవరి ఒకటి మహత్యం ...
నాకొక ఆలోచన ఉంటుంది, నా చుట్టూ ఉన్న మానవ సమాజం నాకు ఇంకో రకమైన ఆలోచన ఉండాలని
నా మీద పరోక్షం గా వత్తిడి తెస్తుంది.
అప్పుడు నేనేం చేస్తానంటే, నా ఆలోచన నాలోనే ఉంచుకొని, బయటకు వచ్చేప్పుడు వత్తిడికి కాస్త లొంగి లేని నవ్వు తెస్తూ ఉంటాను. నా ఘర్షణ మాత్రం అలాగే ఉంటుంది.
ప్రతి అరగంటకూ ఆదుకొనే స్నేహితుడు...ఇంకెవరో కాదు... గ్లాసుడు మంచి నీళ్లు.
ఏవైతే మారవో, వాటిని ఒప్పుకోవాలి. ఆ మాట ముందుగా మనసుకే చెప్పుకోవాలి.
కదలిక ఉన్నప్పుడే నీటి కి అందం......మార్పు ఉన్నప్పుడే మనిషికి అందం.
పాతని వదిలేసి మళ్ళీ కొత్తగా జీవితం మొదలు పెట్టొచ్చు అని పెద్దలు అంటారు, అలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమె ఉపయోగించు కొనేలా ఉండాలి, లేదంటే కొత్తదనాలు ప్రయత్నిస్తూ విఫలమవుతూ జీవితం అక్కడే ఆగిపోవచ్చు.
ఫెయిల్ అన్నది స్వయంకృపారాధం. మార్కులు వేయండి అని అడగడం కరెక్ట్ కాదు. తమ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం మీద ఆపాదించి అనవసరంగా ఎమోషనల్ అవ్వడం వల్ల ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది. అదే ఛాలెంజ్ చేసి చదివి సప్లిమెంటరీ లో పాస్ అయితే జీవితాంతం ఒకింత గర్వంగా ఉంటుంది..
గ్రేస్ మార్కులు ఉండాలి ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది. అది అడిగేది కాదు. చదువుల పట్ల బాధ్యత ఉండాలి.
నిర్ణయం తీసుకున్నావ్, తర్వాత పదే పదే వివరణలు ఇవ్వకు. నిర్ణయం మాత్రమె చెప్పు.
వివరణలు ఇస్తూ ఉంటె, ఎదుటి అభిప్రాయం తెలుసుకోవాలని కొంత కాలానికి అనిపిస్తుంది, ఎప్పుడైతే అలా అనిపించిందో నీ నిర్ణయం సడిలే అవకాశం ఉంది.
తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అన్నది వేరే విషయం...దీనికి ఒక విశ్వజనీనమైన మాట ఉంది....జరిగితే లాభం...లేకపోతే అనుభవం.
విజయం అంటే ఏమిటి, హాయిగా నిద్ర పట్టడం. నిద్ర హాయిగా పట్టడానికి కారణం ఏమిటి, పగలు అలసిపోయేలా పని చెయ్యడం ఒక కారణం అయితే, అయ్యో ఫలానా లేదే అని బాధ లేకపోవడం.
నువ్వెవరు, నువ్వేమిటి అన్న ప్రశ్నలకు జవాబులు పగలంతా పనులూ, రాత్రికి విశ్రాంతి చెబుతాయి, ఒక్కోసారి పగలు అద్దం కూడా కొన్ని చెబుతుంది, అది ఇరుగు పొరుగుల్ని దృష్టిలో పెట్టుకుంటుంది, ఇక రాత్రి కి మనసు కూడా ఎన్నెన్నో చెబుతూ ఉంటుంది, అద్దం చెప్పినవి అన్నీ నమ్మొద్దు అని, కానీ అద్దం ఆకర్షణీయం అయినవి చెబుతుంది, రాత్రి కి మనస్శాక్షి అన్ని పొరలూ విప్పి గుట్ట చేసి పడేస్తుంది, ఇప్పుడు చూడు ఈ వికృతం అని విదురుడు లా ఎదురు నిల్చుంటుంది. దేన్నీ వెతుకుతాం దేన్నీ చేతిలోకి తీసుకుంటాం అనేది మన బుద్ధి, మన అనుభవం...
మోసపూరిత ప్రపంచంలో నిజాయితీగా ఉండడం కష్టం. అసలెందుకు అలా ఉండాలి అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది.
మనం తినే ఆహారం శరీరానికి బలం ఇచ్చినట్లే మన అంతరంగం కూడా ఒక బలం ఇస్తూ ఉంటుంది.
దానికి ఇవ్వాల్సిన ఆహారం నిజాయితీ ..
మనం పుచ్చుకుంటున్న దానికి సరిపడా పని చేయడం, మోసం చేయకపోవడం. ఆ నిజాయితీకి అర్ధం.
అలా నిజాయితీగా ఉంటె మనం ఎదో కోల్పోతున్నాం అనిపిస్తుంది కానీ దాని వలన వచ్చే తృప్తి మనకు ఎంతో బలం ఇస్తుంది...
అది ఎవరిమీదా ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకున్న ధనం లాంటిది.
ఒక్కోసారి నేను నా వయసు వాళ్లకి తగినట్టుగా రాస్తూ ఉంటాను...పిల్లలు వాటిని మీకు అన్వయించుకోకండి. అనుభవాన్ని మించిన పాఠం ఉండబోదు.
ఒకబ్బాయి ఫోన్ చేసాడు..నేను ఈదుతున్నాను మీరు వడ్డున కూర్చున్నారు అన్నాడు...నేను కూడా ఈదిన తర్వాతనే వడ్డున కూర్చున్నా...
సంతోషమే సగము బలము విన్నాము...అలాగే సంగీతం సగం బలం కూడా... మనసు పరిపరి విధాల పోయినపుడు మనల్ని ఒడ్డుకు తెచ్చేది సంగీతమే.
భగవంతుడు కేవలం గుడి లోనే కాదు మనకు గోచరించే ప్రకృతి లో కూడా ఉంటాడు. పసి వాడివి ఇప్పుడు నీకు తెలియదు. కాస్త ఎదిగితే తెలుసుకుంటావు .
ఆ చెట్ల కొమ్మలు ఏమి చెబుతాయి ...గాలితో ఏమి చెబుతాయో ఎన్నెన్నో ముచ్చట్లు ...ఆ భాష తెలిస్తే బాగుండును ...మనిషిని వినే కన్నా...
ఏది నాకోసం నిలబడి ఉంటుందని నేను ఆలోచించగలను, నమ్మకం లేని తోవల్లో మోసాల మధ్యన నడుస్తూ, కనపడిన ప్రతి ఆసరాను, వినపడిన ప్రతి మాటనూ అలవోకగా ఒక భరోసాగా భావిస్తూ, తిరిగి పడుతూ, ఆ నిర్ణయం తప్పని భావిస్తూ, ఇక అనంతమైన ఎదో శక్తిని తలచుకొని...ఆ వెలుగు లో నా నీడ నాకు తోడవుతూ ఉన్నప్పుడు, బహుసా ఆపుడు నా అడుగు బలంగా పడుతుందేమో.
ఇతరులలోని గొప్పతనాలు గమనించి అభినందించడం మంచిదే, అదే సమయం లో మన లోని గొప్పతనాలు కూడా గుర్తించాలి. లేనప్పుడు మెట్లు ఎక్కుతున్న వారిని అభినందనగా చూస్తామే తప్ప మనమూ మెట్లు ఎక్కొచ్చు అని తెలుసుకోలేము.
అట్టడుగు పొరల్లో ఉన్నది పైకి రావడం అంటే ఇదే ....
వృత్తి లో తృప్తి తీరా తన ఆలోచనల సారం తో రేపటి పౌరులను ఒక దీక్ష తో తయారుచేస్తున్న.
నువ్వు ఎంచుకున్న మార్గం లో అప్రతిహతంగా అజేయంగా మరింత ఉన్నతంగా ఎదగాలి.
సమస్య చెప్పు కోవడాన్ని ఒకప్పుడు బలహీనత అని ఎవరూ అనుకొనే వారు కాదు, సానుభూతి కోసం అని కూడా అనేవారు కాదు. అర్ధం చేసుకొనేవారు, చేతనైతే పరిష్కారం చూపించేవారు.
ఇప్పుడు అంతా వ్యతిరేక భావాలే మనసు చుట్టూ.
అద్దం ముందు నిలబడి వర్తమానికి నిట్టూర్చితే ఆ అద్దమే చెబుతుంది, కాస్త నవ్వు ముఖం పెట్టు, లేకుంటే ఇకఇకలూ పకపకలూ వెన్నుకి సూదిగా తగుల్తాయి అని.
మనసుకి కూడా వ్యాయామం అవసరం ...అది ప్రకృతిని చూస్తే నే లభ్యం.
అప్పుడే మొదలయిన ఉదయం, ఉత్సాహంగా ఉంటుంది. ముగుస్తున్న రాత్రికి ఎదో సమాధానంతో సరే అనుకుంటుంది. ఎటొచ్చీ సందిగ్ధంగా గడచేది సాయంత్రం మాతమే,
ఎదో కోల్పోయిన దాన్ని తెచ్చేయాలని, పోతున్నది ఎదో పోకుండా ఆపేయాలని అర్ధం లేని ఒక తాపత్రయం. ప్రతి సాయంత్రమూ ఇంతే, ఇంధనం లేని యంత్రంలా
ఎలా గడిచింది రోజు... చాలా తేలికైన ప్రశ్న. చాలా బాగా గడిచింది.. తెలివైన జవాబు.
స్వేచ్చగా గాలికి ఊగుతూ ఉంటాయి...మనోహరంగా....
సాకారం చేసేయండి.. సాధ్యమే కదా
తనువంతా తడిసి తడిసి .... మనసంతా తడిపి తడిపి....
మనం సంచరించే సమాజానికి మనం ఇవ్వగలిగే గొప్ప కానుక ...ఈ మాత్రం కూడా ఇవ్వలేనప్పుడు మన ఉనికికి అర్ధం ఉండదు.
బతుకు విస్తారం చేసుకోవాలంటే మనం శాంతి మార్గం వెతుక్కోవాలి, చిత్రంగా మనం సౌకర్య మార్గం వెతుక్కుంటాం. ఆ మార్గం శరీరాన్ని మనసుని ఒక మత్తులో పడేస్తుంది, కావలసింది అదే అనుకోని మన ఎన్నిక కచ్చితం అనుకుంటాం, సౌకర్యం ఎప్పుడూ గొలుసు కట్టుతో ఇంకొకదానితో ముడిపడి ఉంటుంది, తెలివి తక్కువగా దేన్నీ పోగొట్టుకున్నా ఆ గొలుసు తెగి ఒక్కొక్కటిగా అన్నీ మాయం అవుతాయి. అప్పుడు శరీరం గానీ మనసు గానీ మనకోసం ఎక్కువగా శ్రమ పడలేవు.
మనం మెట్లు దిగిపోతూ ఉండడం మనం చూడడం తప్ప ఏమి చెయ్యలేం.
చరవాణి ఎంతగా ప్రపంచాన్ని అరచేతిలో పెట్టినా, ఎదురుగా ఒక మనిషి ఉన్న సాటి రాదు.
అలవాటైన సుఖం మొదట్లో ఉత్సాహాన్ని ఇచ్చినా తర్వాత నిర్లిప్తతని ఇస్తుంది.
సంధి దశ....అని ఒకటి ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ.. ఉదయం టీ టిఫిన్ లు అయిపోయాక, ఆ గిన్నెలు సింక్ నిండా కనపడుతూ ఉండగా, వంట ఏమి చెయ్యాలి అని ఆలోచించే సమయం... చాలావరకూ వైరాగ్యం వచ్చే సమయం అది.
బయటకు వెళ్లే అలవాటు తప్పిపోతోంది. ముఖ్యంగా సాయంత్రం చెప్పులు తొడుగుతూ ఉంటే ఎదో తప్పులు చేస్తున్నట్లు అనిపిస్తోంది ఇదేమి ఆలోచన ....ఏమిటో అయోమయం
వాస్తవాన్ని అంగీకరిస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ అంగీకరించే సమయంలో మరింత ఆందోళన ఉంటుంది .
విశాలమైన ప్రకృతి చుట్టూ ఉన్నా, అరచేతిలో ఉన్న మొబైల్ చూస్తూ.... అలా చెడిపోయాను.
కొన్ని ప్రదేశాలు బాగుంటాయి .. ఒక్కరే ఉన్నా సరే ….మనసు ని ఎదురుగ పెట్టి మాట్లాడినట్లు
ఎదో ఒక గురి లేదా లక్ష్యం పెట్టుకో.. దాన్ని సాధించు లేదా సాధించే క్రమంలో ఇక్కడి ప్రయాణం గడిపేయ్... సూక్ష్మంగా చెప్పాలంటే.. ఇదే జీవితం. కానీ... అనుకున్నది సాధించే క్రమం లో చిన్న చిన్న సంతోషాలు అనుభవించడమే అసలైన జీవితం....లక్ష్యం పూర్తీ అయినా కాకపోయినా...
ఏది నాకోసం నిలబడి ఉంటుందని నేను ఆలోచించ గలను, నమ్మకం లేని తోవల్లో మోసాల మధ్యన నడుస్తూ, కనపడిన ప్రతి ఆసరాను, వినపడిన ప్రతి మాటనూ అలవోకగా ఒక భరోసాగా భావిస్తూ, తిరిగి పడుతూ, ఆ నిర్ణయం తప్పని భావిస్తూ, ఇక అనంతమైన ఎదో శక్తి ని తలచుకొని...ఆ వెలుగు లో నా నీడ నాకు తోడవుతూ ఉన్నప్పుడు, బహుసా ఆపుడు నా అడుగు బలంగా పడుతుందేమో.
సినిమా మనకు కాలక్షేపం. వాళ్లకు వృత్తి. ఇంతకుమించి సినిమా వృత్తి కలిగిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన అనవసరం.
ఋతువులు మారిపోతున్నాయి మనుషుల్లానే..
చల్లని నిశ్శబ్దం ....ఉదయం మాత్రమే ఉంటుంది.
ఇష్టాల వెల్లువ లో కొట్టుకుపోకుండా లక్ష్యాలు ఉండాలి అంటారు పెద్దలు, గురువులు. ఒక స్థాయి వచ్చాక, ఈ పాటి ఇష్టాల కోసమా సమయం గడపాలనుకున్నాం..అనిపిస్తుంది. అయితే ఇష్టాల సాధన కూడా ఎంతో కొంత ఉండాలి. లేదంటే ఏ అర్ధరాత్రి నిశీధి లోనో చుక్కలు కూడా లేని ఆకాశం కింద చీకటి మొత్తం మీద పడినట్లు ఉంటుంది. మన హోదా మనలనుండి పక్కుకు విడి మనల్ని చిత్రంగా చూస్తుంది.
మోసం పెరిగిపోతూ ఉండడం వలన, మంచితనం ఒంటరి అవుతోంది. మంచితనం వలన ఒరిగేదేమిటి అంటే కాస్త భిన్నంగా ఉన్నాం అన్న ఆత్మ సంతృప్తి. అంతే.
నమ్మకం అనేది ఎండిన చెట్టు కొమ్మ లాంటిది .... విరిగితే ఏమి చెయ్యాలో ఆలోచించి ఆ పిమ్మట ఆ కొమ్మ అందుకోవాలి .
ఒక్కోసారి కొన్ని పోగొట్టుకోవడం కూడా మంచిదే,
ఊహా కనపడేంతగా హద్దులో ఉంటుంది, లేదంటే
కోరిక విశాలమైన చీకటి ఆకాశంలో ఎక్కడో చేరిపోతుంది.
ప్రపంచం మనల్ని ఏ దృష్టి తో చూస్తె, మనల్ని మనం కూడా అదే దృష్టి తో చూసుకోకూడదు. ప్రపంచానికి తన భావం ముఖ్యం. మనకు మన జీవితం ముఖ్యం.
పది రోజులకి పైగా ఎండ లేదని అదొక ఇబ్బంది అనుకుంటే, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి, ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్ళ బాధ ఇంకెంత. తృప్తి కి కొలమానం ఇక్కడే తెలుస్తుంది.
చెడు అంటే సమాజానికి నష్టం చేసే గుణమా లేక మనకు నచ్చని గుణమా అంటే చాలావరకూ మనకు నచ్చని ప్రతి అంశమూ చెడు కిందనే లెక్క వేస్తాము. అందుకే చెడు పరిమాణం మంచి కంటే పెరిగిపోయినట్లు ఉంటుంది.
నీకు నచ్చినట్టు ఉండు. నీకు కావలసింది తీసుకో, అయితే మోసం మాత్రం చెయ్యకు. మోసం చెయ్యకుండా అలా ఎలా అంటావా అదే నీ సామర్ధ్యం, నీ వివేకం.
ప్రకృతి ఎప్పుడూ అందాలు విరజిమ్ముతూ ఉంటుంది. మనమే పట్టించుకోము.
ఒక్కోసారి కొన్ని పోగొట్టుకోవడం కూడా మంచిదే, ఊహా కనపడేంత గా హద్దు లో ఉంటుంది, లేదంటే కోరిక విశాలమైన చీకటి ఆకాశం లో ఎక్కడో చేరిపోతుంది.
గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు సమాజం దృష్టిలో గొప్పవారు, ఇతరులకు భంగం లేని విధంగా తన బతుకు తాను బతికే వాడు కూడా గొప్పవాడే.
కెరటం వస్తుంది .పాదాన్ని ముంచి పోతుంది ….. సమస్య వచ్చి పోయినట్లే బతుకులో... మూర్తి మాటలో ఒక ధైర్యం ...
కెరటం వస్తుంది...ఇసుకకొస్తుంది. మళ్ళీ ఇసుక పాదాలను తాకుతుంది. బతుకు లో ఎదో దొరికినట్లు ఉన్నా... నిజానికి ఏదీ నిలవదు వసుంధర మాటల్లో ఎదో నైరాశ్యం...
మంచి గురించే మాట్లాడేవారు మర్యాదస్తులు,
చెడు గురించి మాట్లాడక పోవడమే మర్యాద అనుకుంటారు.
మంచితో పాటూ చెడు కూడా ఉందని అంటారు ఆలోచనా పరులు.
చెడుఎందుకు ఉంది అది చెడు ఎలా అయ్యింది
దాన్ని బహిష్కరించడమా సంస్కరించడమా అనేది చర్చించే వారు మేధావులు.
మనం అనుకున్నవి మనం సాధించ గలుగుతాం, కాకపోతే అది అందే సమయానికి మనం మరింత పెద్ద కోరిక లో ఉంటాం, అప్పుడు దొరికినది మనకు పెద్ద ఉత్సాహాన్ని ఇవ్వదు, అందుకే తృప్తి ఉండాలి అంటారు పెద్దలు.
ఎవరిలోకం వారిది ఈ రోజుల్లో... మనకంటూ ఒక లోకం లేనప్పుడే, మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదనుకుంటాం.
సుఖాంతం అయిన కథలు మన నమ్మకాలను బలపరుస్తాయి. దుఃఖాంతం అయిన కథలు మనకు అనుభవాన్ని ఇస్తాయి .
ముఖ్యంగా అరవై వయసుపై బడిన వారు, అనారోగ్యాన్ని మనసు లోకి తీసుకోకూడదు. అనారోగ్యానికి తీసుకుంటున్న ఔషధం పని చేస్తుందనే నమ్మకం కలిగి ఉండాలి. వీలయినంత మటుక్కి వర్తమానాన్ని ఆనందం గా గడిచేలా చూసుకోవాలి. మనసు ఇబ్బంది పడే ఆలోచనలు ఏమన్నా వస్తే, అప్పటికప్పుడుగా వేరే పనిలోకి వెళ్ళాలి, లేదూ ఆ సంఘటనని తేలిగ్గా తీసుకోగలిగేలా మనల్ని మార్చుకోగలగాలి.
ఆఖరుగా ఆలోచించాల్సింది ఇన్నాళ్ళు ఈ భూమి మీద సంచరించాం, ఈ సంచారం ఆగిపోతే నష్టమేమి లేదు అనుకోగలగాలి.
ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు. నేను అంగీకరించి పాటిస్తున్నవి.
ఒక ఆలోచనకి తుది రూపం ఫలానా విధంగా ఉండొచ్చు అని ఆలోచించాలి కానీ ఉంటుంది అని ఆలోచిస్తే గడువు దగ్గర పడే కొద్దీ ఆ తుది రూపం మరో విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది
అందుకే వర్తమానాన్ని ప్రేమిస్తూ పోవడమే.
కనపడిన ప్రతి విశేషం దగ్గరా ఆగిపోతే అవన్నీ మన మీద స్వారీ చేస్తాయి, మస్తిష్కం నిండా నిండిపోయి ఏమీ తోచని స్థితి తెస్తాయి. అవసరం లేనివి అన్నీ ముందు వేసుకున్నట్లు అవుతుంది. ఎక్కడికక్కడ నవ్వేసి ముందుకు పోతే తర్వాత మనల్ని వెనక్కి లాగేవి ఏవీ ఉండవు.
వ్యక్తి ఆరాధన అనేది స్వీయ అభివృద్ధికి ఆటంకం. మనకు నచ్చిన వ్యక్తుల పట్ల ఆరాధన ఉండొచ్చు, మరి మన మాటేమిటి, ఉన్న సమయం కాస్తా వాళ్ళ ధ్యాసలోనే గడిపేస్తే మన అభివృద్ధి ఎలా.. చాలా యువత ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారు.
ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం అయితే అది అతనికి వోటు వేయడం వరకే, ఒక సినిమా నటుడు అంటే ఇష్టం అయితే అతని సినిమా చూసి ఆనందించడం వరకే. ప్రమేయం అంతవరకే ఉండాలి. ఉన్న సమయాన్ని తన ఎదుగుదలకు ఉపయోగించుకోని యువత గోడకేసి తల బాదుకొనే రోజు వచ్చేవరకూ సత్యాన్ని గ్రహించలేరు. అప్పటికి నడుము లోతు నీరు చేరుతుంది.
నవ్వుకోవడం ఉండాలి కానీ ప్రతి విషయాన్ని హాస్యంగా తీసుకోకూడదు.
కొత్త చొక్కా......ఇంకా చొక్కా లో నేను......
మనది కాక పోతే, కాశీ వరకూ ... అని ఒక సామెత. ఇరవైనాలుగు గంటలూ రెస్ట్.... అలాగ...మన ఇల్లు కాకపోతే.
ఒకళ్ళ కష్టం మనం తీర్చలేనప్పుడు, బాగున్నావా అని అడగాలని ఉన్నా, అలా అడగడం బాగుండదు.
మోసం పెరిగిపోతూ ఉండడం వలన, మంచితనం ఒంటరి అవుతోంది.
మోసం చేసే ప్రపంచం లో మోసగింపబడడం సహజం. అయితే మనం మోసం చెయ్యకపోవడం వలన లాభం ఏమిటంటే, మనం తిట్టుకొనే జాతి లో మనం ఉండం.
ఒక భౌతిక రూపం జ్ఞాపకాల్లోకి మారిపోవడమే మరణం అంటే...
ఒకరు వాళ్ళ అభిప్రాయం చెబితే ఇంకొకరు వాదనకి వస్తున్నారు. చాలా పోస్టుల్లో ఇవాళ కామెంట్ల యుద్ధం చూసాను.
ఫేస్ బుక్ చాలా వరకూ ఒక యుద్ధ భూమి.
మన ఇబ్బందులు ఎవరికన్నా చెబితే వారు వినగలరు, అర్ధం చేసుకోగలరు కానీ వాళ్ళు మన బాధ్యతలను వాళ్ళ తలకి ఎత్తుకోలేరు కాబట్టీ ఎవరికీ ఏ కష్టం అన్నా చెప్పుకోవడం వరకే మనిషి తృప్తి పడాలి. మీ చుట్టుపక్కల బలహీన మనస్కులు ఎవరన్నా ఉంటె వాళ్ళతో ఈ విషయం ప్రస్తావించండి.
నచ్చిన మంచి భోజనం తిని దాన్నిఅరిగించు కోగల ఆరోగ్యాని, వ్యాయామాన్ని కలిగి ఉండాలి.
మరొక విషయం. నచ్చిన కొందరు వ్యక్తులతోనే మమేకం అవుతూ మిగతా వారిని కాలక్షేపం కోసం గమనిస్తూ ఉండాలి. ఇది నాలాంటి సీనియర్ సిటిజెన్స్ కోసం...
ఒక దగ్గర కూర్చొని నిశ్చలంగా ఉండు అంటే అది మనకు నచ్చదు. కానీ ఎక్కడ కూర్చున్నా నిజానికి మనం అలజడి మోస్తూనే ఉంటాం. చెరువు వడ్డున ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న అలలు సుతారంగా వడ్డున తాకుతూ ఉన్నా సరే, మనం రాయి విసిరి ఒక పెద్ద తరంగం కోరుకుంటాం.
పారని నీరు, వాడని ఇనుము పాడవుతాయి అంటారు. పారే యేరు గలగలా శబ్దం చేస్తుంది, ప్రవహించే సమయం మాత్రం శబ్దం ఏమి చేయదు, మనమే సృష్టించాలి ఆ శబ్దాన్ని. ఎదురుగా ఉంటె బాగున్నావా అని మాట చేర్పు, లేకుంటే అక్షరాల కూర్పు.
లేవగానే ఒక ప్రశ్న మనసులొ. నిన్న ఏమి జరిగింది ఎలా జరిగింది. బాగున్నది జరిగిందా అపుడు అది మనసు మూలకు పోతుంది సంతృప్తి గా, లేదూ నచ్చలేదంటే అదొక ఱంపం.
ఈ ఆలోచనలో ఇవ్వాళ్టి రోజు జరిగిపోతూ ఉంటుంది
అందుకే రమణ మహర్షి గమనిస్తూ ఉండండి అన్నారు. జరిగే వాటికి కంగారు పడకుండా.
కధలు ఎవరి సామర్ధ్యాన్ని బట్టీ వాళ్ళు రాస్తారు. ఇది గొప్ప అని ఇది కాస్త తక్కువ గొప్ప అని తూకం రాళ్ళకి నేను నా కధలు ఇవ్వను అన్నాను.
అందుకే నేను నా వాల్ మీదనే రాస్తాను. నచ్చిన వాళ్ళు చదివుతారు.
పూజ సమయం లో అతను కాస్త ఎత్తున, మనం కాస్త కిందన కూర్చుంటాం, అప్పుడు ఆ సమయం లో భక్తి కావొచ్చు, విన్నపం కావొచ్చు లేదా పూజ చేయాలన్న సంకల్పం లో ని శ్రద్ధ కావొచ్చు, మనం మన పనిలో మునిగిపోతాం.
ఆ తర్వాత అయినా ఏదైనా సమయంలో అతని విగ్రహం వైపు చూస్తూ ఎదురుగా మనతో ఉన్నట్టు కాసేపు అనుకోని మాట్లాడాలి, అప్పుడు ఏదీ దాచకుండా మాట్లాడుతాం. మనిషితో తో అయితే ఎందుకులే అని దాచడం గానీ, ఎంతో ఉందని లేనిది చెప్పడం గానీ చేస్తాం, అతనితో అలా చేయం కదా. అలా అతనితో సంభాషణలో జీవితం పట్ల మన వైఖరిని నిర్మొహమాటం గా మాట్లాడగలం, ఫలానా చేయకూడదు అనుకుంటూనే చేయడం గురించి, చేయాలి అనుకోని చేయలేకపోవడం గురించి మాట్లాడితే మనం మారినా మారకపోయినా ఎవరో ఆత్మీయుడి తో మాట్లాడిన సంతృప్తి ఉంటుంది. అది నేను అభ్యాసం చేస్తున్నా.
వర్షం లో పూర్తిగా తడిసి బరువుగా వాలిపోయిన పూల కొమ్మలు చూడడం నాకెంతో సరదాగా అనిపిస్తుంది.
నీళ్ళు చేరిన గడ్డి మీద నడిస్తే నీళ్ళు చిందుతూ వచ్చే ఆ శబ్దం అదొక సంగీతం నాకు.
వర్షం వస్తే కరంట్ పోతుంది అని బాధ గా ఉంటుంది తప్ప తడిసిపోతాను అనే బాధ ఉండదు.
హ హ హ ఏమిటో ఐదో క్లాసు పిల్లాడు పాఠం అప్పజేప్పినట్లు ఉంది కదా.
బాగులేదు అనిపిస్తే, బాగు చేసుకోవాలి, లేదూ ఆ బాగులేని తననాన్ని ఒప్పుకోవాలి, కేవలం ఒప్పుకోవడమే కాదు ప్రేమించాలి. అప్పుడు ప్రపంచానికి జవాబు చెప్పగలం.
ఫలానా వారితో ఫోటో, అతనెంతో గొప్పవాడు.
అవునా, మరి నువ్వో...
హా మనది ఏముందిలే....
అదే వద్దు, చెప్పని తెలియని గొప్ప నీలోనూ ఉంటుంది, అతని తో ఫోటో కావాలి అంటే తీసుకో, అదెంతో గొప్ప అని మురిసిపోకు.
నువ్వెవరికి గుర్తున్నావు.... ఒక ప్రశ్న.
నీకెవరు గుర్తున్నారు ఇది మరో ప్రశ్న.
మొదటి ప్రశ్న అర్ధరహితం. ఈ ప్రశ్న మనల్ని కిందకు లాగుతుంది.
ఇక రెండో ప్రశ్న, అందులో నీ నైజం ఉంటుంది, దాన్ని కాస్త గమనిస్తూ ఉండాలి.
Comments
Post a Comment