Bhargava G
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
31 Mar 2023
ప్రకృతి క్రమాలకు ఉద్దేశ్యాలు, అర్థాలు ఉండవు.
వాటిని సహానుభూతితో అర్థం చేసుకోవడం ఉండదు. వివరించడమే ఉంటుంది. ఎందుకంటే.. మనుషులంగా మనమిచ్చుకునే అర్థాలకు అతీతమైనది ప్రకృతి.
సంస్కృతి విషయం అలా కాదు.
వివరించడానికి ప్రయత్నించేందుకు మొదలు
దాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది.
ఆ సంస్కృతిని పాటించే వారు స్వయంగా ఏ అర్థం ఇచ్చుకుంటున్నారో గ్రహించడంతో మొదలు బెట్టి ఇతర అర్థాలు ఏమయినా సాధ్యమా అన్న ప్రశ్నకు జవాబు వెదకవలసి ఉంటుంది.
ఆ తరువాత మాత్రమే...
ఆ సంస్కృతి పుట్టడానికీ కారణమేమిటో...
ఆ సంస్కృతి నెరవేర్చుతున్న ప్రయోజనమేమిటో
వివరించడం సాధ్యమయ్యే అవకాశం ఉంది.
మానవ జీవితంలో జరిగే ఘటనలకు కారణాలతో పాటు, ఉద్దేశ్యాలూ, అర్థాలు కూడా ఉంటాయి. ప్రకృతి లో కార్యకారణాలు మాత్రమే ఉంటాయి.
మనం నిర్ణయించుకునే ఆర్థమే కానీ ప్రకృతికి స్వయంగా ఏ అర్థం ఉండదు. మన కోసం ఉండదు. మనలను దృష్టిలో పెట్టుకోదు.
ప్రకృతి లో జరిగే ఘటనలకు అర్థం ఉండదు. ఆ ఘటనలను జనింపచేసే నిర్మాణాలు (Structures), శక్తులూ (Forces), సంపర్కాలు (Interactions) ను వివరించడమే విజ్ఞాన శాస్త్రం పని అని చెబుతున్నాను.
--------------------------------------------
29 మార్చి 2023
అమాయకులయిన శ్రామిక జన భక్తులకు దేవుడంటే..
అభయమిచ్చే వాడు. ఆపదల్లో అండగా ఉండే వాడు. అంతే.
ఆశవ పల్లకిలో ఊరేగే మధ్యతరగతికి దేవుడంటే..
కోరిన వరాలిచ్చేవాడు
బతకనేర్చిన తనంలో రాటుదేలినవాడికి
దేవుడంటే.. తక్షణమే నోట్లోంచీ బంగారు నెక్లెస్ తీసిచ్చే తోడుదొంగ.
అలాంటి సమాజంలో తయారయిన రచయితల్లో కూడా ఈ మూడురకాల వాళ్ళుండడం విడ్డూరమేమీ కాదు.
--------------------------------------------
21 మార్చి 2023
నీ జ్ఞాపకాల సంచీ ఖాళీ ఐపోయాక నీవు రాసేదే... నీ మొదటి రచన.
--------------------------------------------
13 మార్చి 2023
మందలుగా జనాలు ఒక విషయాన్ని మెచ్చుకుంటున్నప్పటికీ..ఎవరికైనా
ఆ విషయం నచ్చకపోతే చెప్పగలిగే స్పేస్ ఉండడం ఆధునిక జీవితానికి ఒక ముఖ్యమైన గీటురాయి.
ఆ విలువ ను కాపాడుకోలేక పోయినప్పుడు
ప్రజాస్వామ్యం చచ్చి మూకస్వామ్యం మొలకెత్తుతుంది.
ఈ మూకస్వామ్యం ఒక సంస్కృతిగా బలపడ్డాక
రాజకీయాలు మెజారిటేరియన్ ఉన్మాదానికి రాచబాట గా మారతాయి.
--------------------------------------------
12 మార్చి 2023
కొందరికి సాహిత్యం ఉద్యమం.
ఆవేశంతో కూడిన ఆశయం వీరిది.
మరికొందరికి సాహిత్యం ఒక ప్రొఫెషన్. ఒక కెరియర్.
తెలివితో కూడిన వ్యూహం వీరిది.
ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు మౌలికంగా భిన్నమైనవి.
వీరిద్దరికీ ( ముఖ్యంగా పీడిత సముదాయాలకు చెందిన వారికి)కలసి పనిచేయవలసిన సందర్భంలో బతుకుతున్నామని ఎరుక ఉండడం ముఖ్యం.
ప్రెజుడిస్ ను ,వ్యక్తిగతమైన ఇగోలనూ
కాస్తా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోకపోతే
ఇద్దరూ నవ్వుల పాలయ్యేది మాత్రం ఖాయం.
--------------------------------------------
👁️🗨️👌🔖♻️@🌳
Energy Enjoy Entity
Comments
Post a Comment